వెలుగు, స్పోర్ట్స్ డెస్క్: టీమిండియాలో కెప్టెన్, కోచ్ మధ్య ఉండే అనుబంధం ఎప్పుడూ ప్రత్యేకమే. హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ తన పదవీకాలాన్ని ముగించిన వెంటనే రోహిత్ శర్మ.. తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఓ భావోద్వేగ పోస్ట్ వైరల్ అయ్యింది. ‘నా భార్య మిమ్ముల్ని నా వర్క్ వైఫ్ అని పిలుస్తుంది. మిమ్ముల్ని అలా పిలిచే అవకాశం లభించినందుకు నేను అదృష్టవంతుడిని’ అని హిట్‌మ్యాన్ అందులో రాసుకొచ్చాడు.
అంటే కోచ్–కెప్టెన్ బంధాన్ని భార్యాభర్తతో పోల్చి అది ఎంత ధృడమైందో అందరికి చెప్పే ప్రయత్నం చేశాడు. ఎందుకంటే ఇద్దరికీ ఒకే విధమైన ఆలోచనా విధానం ఉండటంతో పాటు ఒకే తాటిపై నడవాలి. మరో రెండు రోజుల్లో సొంతగడ్డపై టీమిండియా టీ20 వరల్డ్ కప్ టైటిల్ వేటను మొదలుపెట్టనున్న నేపథ్యంలో సహజంగానే కెప్టెన్ సూర్యకుమార్, చీఫ్ కోచ్ గౌతమ్ గంభీర్ మధ్య ఉన్నపని సంబంధాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి, ఆతృత ఉంటుంది.
ప్రస్తుతానికి ఈ ఇద్దరి మధ్య అద్భుతమైన సంబంధం ఉంది. ఈ ఇద్దరి నేతృత్వంలో ఇండియా 39 టీ20 మ్యాచ్‌లు ఆడితే 31 విజయాలు సాధించింది. అంటే విజయాల రేటు 79.84 శాతంగా ఉంది. ఇదే జోరుతో జట్టుకు వరుసగా రెండోసారి టీ20 కప్ అందించాలని
అభిమానులు కోరుకుంటున్నారు.
ఫుట్‌బాల్ మేనేజర్ తరహాలో..
ఇండియన్ క్రికెట్‌లో చాలా మంది విజయవంతమైన కెప్టెన్లకు కోచ్‌లు ఎప్పుడూ రెండో స్థానంలో ఉన్నారు. రవిశాస్త్రి కూడా.. ఇది విరాట్ కోహ్లీ జట్టు అని, దానికి కెప్టెన్ అధిపతి అని ఎప్పుడూ చెప్పేవాడు. జాన్‌రైట్–సౌరవ్ గంగూలీ, గ్యారీ కిర్‌స్టన్–ఎం.ఎస్. ధోనీ, ద్రవిడ్–రోహిత్ విషయంలోనూ ఇదే జరిగింది. చాపెల్–ద్రవిడ్ శకం తర్వాత వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో కోచ్‌కు ఆధిపత్యం బాగా పెరిగింది. ఇందులో సూర్య–గౌతీ కాంబినేషన్ టాప్‌లో ఉంటుంది.
టీ20 ఫార్మాట్ మార్పుల కారణంగా ఈ ఇద్దరి బంధం అత్యంత వేగంగా పరిణామం చెందింది. ఫుట్‌బాల్ మేనేజర్ తరహా కోచింగ్‌ను అవసరంలోకి తీసుకొచ్చింది. ఇది గంభీర్ స్టయిల్‌కు సరిగ్గా సరిపోతుంది. గౌతీ ప్లాన్స్‌ను పక్కాగా అమలు చేయడానికి సూర్య 2.0 ఇప్పుడు రెడీగా ఉన్నాడు. ఎందుకంటే తన నైపుణ్యాలపై అపారమైన నమ్మకాన్ని కలిగి ఉన్న సూర్యకు వాటిని సంపూర్ణంగా అమలు చేయగల సామర్థ్యమూ ఉంది. అందుకే గౌతీ–సూర్య కాంబినేషన్ హిట్టయింది.
గంభీర్ కెప్టెన్సీలోనే ‘సూర్యోదయం’..
సూర్య కెరీర్ ఈ స్థాయికి రావడంలో గౌతమ్ పాత్ర ఉంది. గంభీర్ కెప్టెన్సీలోనే కేకేఆర్ తరఫున సూర్య అద్భుతమైన ఫినిషర్ పాత్ర పోషించాడు. ఆ ఫామ్‌తోనే టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. అప్పట్లో ‘స్కై’ అనే నిక్‌నేమ్ కూడా గంభీరే పెట్టాడు. 2024లో హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన మరుక్షణమే హార్దిక్ పాండ్యాను కాదని సూర్యకు టీ20 కెప్టెన్సీ దక్కడంలో గౌతీదే కీలక పాత్ర.
సెలెక్టర్ అజిత్ అగార్కర్, గంభీర్, సూర్య కలిసి సంజూ శాంసన్‌ను టాపార్డర్‌కు పంపడం. మరో పరిణామం. ఈ పరిణామాల్లన్నింటిలోనూ సూర్య చూపిన ప్రశాంతత, ప్రవర్తన, సంయమనంతో కూడిన వైఖరి అందర్ని ఆకట్టుకుంది. తర్వాతి రోజుల్లో ఆ ప్రయాణం సవ్యంగా ముందుకు సాగింది.
వ్యక్తిత్వాలు వేరైనా.. లక్ష్యం ఒక్కటే
వ్యక్తిత్వాల విషయంలో గంభీర్, సూర్య పూర్తి భిన్నంగా ఉన్నా.. లక్ష్యం మాత్రం జట్టు గెలుపే. గంభీర్ అత్యంత సంపన్న వ్యాపార కుటుంబం నుంచి వస్తే.. సూర్య ఓ మధ్యతరగతి ఫ్యామిలీ నుంచి వచ్చాడు. గంభీర్, సూర్య ఇద్దరిలో దేశభక్తి చాలా ఎక్కువ. దాన్ని ఇద్దరూ బహిరంగంగా ప్రదర్శిస్తారు.
22 గజాల పిచ్‌పై పోరాడటం అంటే దేశం కోసం బుల్లెట్ తీయడంలాంటిదని గంభీర్.. నితీశ్ రెడ్డికి నూరిపోస్తే.. పాక్ కెప్టెన్ సల్మాన్ ఆగాతో షేక్ హ్యాండ్ ఇవ్వకుండా చూయింగ్ గమ్ నములుతూ క్యాజువల్‌గా వెళ్లిపోవడం సూర్య స్టైల్.
పక్క దేశం విలేకరిని పిలిచి మరి.. ఇండో–పాక్ మ్యాచ్ మధ్య పోటీ అనేది గతించిపోయిందని చెప్పడం అతనికే చెల్లింది. ఓవరాల్‌గా వీళ్ల బంధం ఎంత ధృడంగా ఉన్నా.. ఎన్ని మ్యాచ్‌లు గెలిచినా.. ఇప్పుడు మాత్రం ఒకే టోర్నీతో వీళ్లపై ఓ అంచనాకు రానున్నారు. అదే టీ20 వరల్డ్ కప్. దాన్ని గెలిస్తే సక్సెస్‌ఫుల్ కోచ్–కెప్టెన్‌గా చరిత్రలో నిలిచిపోతారు.
